శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ మియాపూర్-1 డిపో ఆధ్వర్యంలో వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు, ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఓ. సుధా తెలిపారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

పంచారామ క్షేత్ర దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీ..
పంచారామ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ బస్సును ఏర్పాటు చేశారు. నవంబర్ 13వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి బస్సు బయలుదేరుతుంది. నవంబర్ 15వ తేదీ ఆదివారం తిరుగు ప్రయాణం ఉంటుంది. సర్వీస్ నంబర్ 96644 కాగా, రానుపోను కలిపి టికెట్ ధరను రూ.3,070గా నిర్ణయించారు.

ఐదు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్ర ప్యాకేజీ..
కార్తీక మాస తీర్థయాత్రలో భాగంగా కాళేశ్వరం, రామప్ప ఆలయం, భద్రకాళి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాల దర్శనానికి మరో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సు మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది. సర్వీస్ నంబర్ 96642 కాగా, రానుపోను ప్రయాణానికి ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,840గా నిర్ణయించారు.
శబరిమలకు ప్రత్యేక బస్సులు..
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మియాపూర్-1 డిపో నుంచి నాన్ ఏసీ సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. భక్తులు ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.
మియాపూర్-1 డిపో పరిధిలోని మియాపూర్ ఎక్స్ రోడ్స్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల నుంచి 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్న గ్రూపులకు ప్రత్యేక బస్సులను అద్దెకు అందించనున్నట్లు తెలిపారు. వివాహాలు, శుభకార్యాలు, విహారయాత్రలు, పర్యాటక పర్యటనలు తదితర అవసరాలకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, ఇతర గ్రూపులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు, వివరాల కోసం 9959226153, 8008336063, 9000295973, 8309107813, 9059162162 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. కార్తీక మాసంలో భక్తులు, ప్రయాణికులు టీజీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సాగించాలని డిపో మేనేజర్ ఓ. సుధా కోరారు.





