దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలో కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ల దోపిడీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దోపిడీ కేసులను ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. వనగండ్ల నరేష్ (19), తండ్రి నర్సయ్య, వృత్తి కూలీ, అంబేద్కర్ కాలనీ, జూబ్లీహిల్స్ నివాసి కాగా కుర్మ నవీన్ (19), తండ్రి నారాయణ, మస్తాన్ నగర్, మాదాపూర్ నివాసి.

నిందితులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి సెల్‌ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించేవారు. ఈ క్రమంలో దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిని అడ్డగించి మొబైల్ ఫోన్ లాక్కునేందుకు యత్నించారు. బాధితుడు ప్రతిఘటించడంతో నిందితుల్లో ఒకరు కత్తితో అతని భుజంపై దాడి చేయడంతో రక్తస్రావ‌మైంది. అనంతరం బాధితుడి వివో సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఇదే తరహాలో మరో ఘటనకు పాల్పడి రెడ్‌మీ సెల్‌ఫోన్‌ను కూడా దోచుకున్నారు. ఈ కేసులపై దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు, అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించినప్పటికీ వారిని పట్టుకున్నారు. విచారణలో నేరాలను అంగీకరించడంతో వారి వద్ద నుంచి దోచుకున్న రెండు సెల్‌ఫోన్లతో పాటు నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

వారిపై పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. క్రైమ్ నంబర్ 1765/2026 కింద సెక్షన్లు 309(6), 109 r/w 3(5) BNS, క్రైమ్ నంబర్ 1766/2026 కింద సెక్షన్లు 309(6), 109 r/w 3(5) BNSల పేరిట కేసులు న‌మోద‌య్యాయి. ఈ రెండు కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీస్ క్రైమ్ టీమ్ పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here