శేరిలింగంపల్లి, నవంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): రోజురోజుకూ విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీహెచ్ఈఎల్లోని ఎంఐజీ ఇందిరాగాంధీ మహిళా భవనంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఒమెగా, పీఆర్కే ఆసుపత్రుల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చందానగర్ ఒమెగా పీఆర్కే ఆసుపత్రుల రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) గణాంకాల ప్రకారం దేశంలో ఏటా సుమారు 15 నుంచి 16 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, దాదాపు 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 50 శాతం భారత్, చైనా దేశాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ శరీరంలోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, ఈ వ్యాధిలో సుమారు 144 రకాలు ఉన్నాయని డాక్టర్ స్వర్ణకుమారి వివరించారు. ధూమపానం, మద్యపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం, ఊబకాయం, పర్యావరణ కాలుష్యం, ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్, రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం, వంశపారంపర్య జన్యుపరమైన అంశాలు క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాద కారకాలుగా పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ కణాలు, డీఎన్ఏలో ఏర్పడే మార్పులు కూడా వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతాయని తెలిపారు.
శరీరంలో గుర్తించగలిగే గడ్డలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం, నిరంతర అలసట, చర్మం రంగులో మార్పులు, మానని పుండ్లు, పుట్టుమచ్చల్లో మార్పులు, దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు, మింగడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం, అజీర్ణం, కీళ్లు, కండరాల నొప్పులు, తరచూ జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ధూమపానం, మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, తాజా ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లను పాటిస్తూ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, హెచ్పీవీ, హెపటైటిస్ బి వంటి టీకాలు వేయించుకోవడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు.
క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ప్రధాన విధానాలని తెలిపారు. వైద్యరంగంలో పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో క్యాన్సర్ చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన క్యాన్సర్లను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా మమ్మోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ కౌండిన్య వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు జ్యోతి, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శశిరేఖ, బి. లక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణీ సాంబశివరావు, ఉమాశంకర్, ఆసుపత్రి సిబ్బంది జాకీర్ హుస్సేన్, సందీప్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.





