మియాపూర్‌లో మెగా రక్తదాన శిబిరం.. 300 మందికి పైగా రక్తదానం

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినాన్ని పురస్కరించుకుని మియాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మియాపూర్ సీఐ జయరాం, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, శ్రీ చైతన్య విద్యాసంస్థల AGM రవికుమార్‌తో కలిసి కేక్ కట్ చేసి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానంలో పాల్గొన్న దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. విద్యారంగంలో డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా రక్తదానం చేయడం గొప్ప విషయమని, రక్తదాతలందరికీ అభినందనలు తెలిపారు. అన్ని దానాల్లో రక్తదానం అత్యంత గొప్పదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని గాంధీ పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. తలసేమియా బాధితులు, గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నిత్యం రక్తం అవసరమవుతుందని, సరైన సమయంలో రక్తం అందక అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, ఇతర వస్తువులను పునరుత్పత్తి చేయగలిగినా రక్తాన్ని మాత్రం మరొకరు దానం చేస్తేనే పొందగలమని పేర్కొన్నారు. రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకుని, రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్తర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here