శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 100 పరిధిలో ఉన్న ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీలలో నివసిస్తున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలు జారీ చేయాలని, సర్వే నంబర్లు 100, 101లోని మిగులు ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ యంసిపిఐ(యు) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ మాట్లాడుతూ.. మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న సుమారు 550 ఎకరాల భూమిని విక్రయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను విక్రయిస్తూ పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన భూములను రియల్ ఎస్టేట్ శక్తులకు అప్పగించడం సరికాదని, ఈ భూములు పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సర్వే నంబర్ 100లో గత 30 ఏళ్లకు పైగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేద ప్రజలు 68 గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు చట్టబద్ధత కల్పించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవో నంబర్లు 505, 166, 58 కింద గతంలో ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. గత టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వివిధ కారణాలు చూపుతూ పట్టాల జారీ విషయంలో కాలయాపన చేశాయని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టాల జారీ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని, వెంటనే నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలు, ప్రభుత్వ భూముల విక్రయాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వనం సుధాకర్ డిమాండ్ చేశారు. ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీల పేదలకు తక్షణమే ఇంటి పట్టాలు జారీ చేయాలని, సర్వే నంబర్లు 100, 101లోని మిగులు ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాలకు కేటాయించాలని కోరారు. భూముల విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సర్వే నంబర్లు 100, 101లోని ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, డిగ్రీ కళాశాల, 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, జూనియర్ కళాశాల, మినీ స్టేడియం, మార్కెట్ యార్డు నిర్మాణాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కూడా భూమిని కేటాయించాలని కోరారు. ప్రభుత్వం భూముల విక్రయానికి ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య, తాండ్ర కళావతి, వి. తుకారాం నాయక్, పి. భాగ్యమ్మ, కర్ర దానయ్య, ఇస్లావత్ దశరత్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కమిటీ సభ్యులు జి. శివాని, లలిత, నిమ్మక నాగభూషణం, ఎం.డి. సుల్తానా బేగం, బి. అరుణ, డప్పు రాజు, రాములు, కే. మాధవ, అమీనా బేగం తదితరులు పాల్గొన్నారు.





