నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం వివేకానంద నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సదరన్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, CMC ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల్లో ఇప్పటికే పలు మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. నడిగడ్డ తండాలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పైప్‌లైన్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని CRPF ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావును కోరారు. మియాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 600 నుంచి మెట్రో స్టేషన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా CRPF ఆధీనంలోని స్థలంలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

మియాపూర్ చౌరస్తాలో అండర్‌పాస్, 200 అడుగుల రోడ్డు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సర్వీస్ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. నడిగడ్డ తండా నుంచి HDFC బ్యాంక్ బొల్లారం రోడ్డు పక్కన మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాంధీ తెలిపారు. UGD పైప్‌లైన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తే వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మురుగునీటి మళ్లింపు ద్వారా కాలనీలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని వివరించారు.

నడిగడ్డ తండాలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, పెండింగ్‌లో ఉన్న రోడ్లు, UGD నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గాంధీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా CRPF సదరన్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు స్పందిస్తూ గాంధీ వివరించిన అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో CMC ఇంజినీరింగ్ విభాగం SE శ్రీకాంతిని, DE బాలమురళి, AE ప్రశాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here