శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమెరికా దేశస్థుడు హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. SLN టెర్మినస్‌లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) తన వ్యాపార పనుల నిమిత్తం వ్యాపార భాగస్వామి డేవిడ్ వుతో కలిసి నవంబర్ 2న హైదరాబాద్‌కు వచ్చాడు. వీరిద్దరూ మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో బస చేస్తున్నారు.

ఈ క్రమంలో నవంబర్ 4వ తేదీ సాయంత్రం నుంచి మిచెల్ బ్రియాన్ లీ ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. దీంతో నవంబర్ 5న సాయంత్రం సుమారు 6:30 గంటలకు హోటల్ సిబ్బంది అతని గది వద్దకు వెళ్లి తలుపులు తెరిచి చూడగా, 12వ అంతస్తులోని 1218వ నంబర్ గదిలో మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే హోటల్ సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు హోటల్‌కు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి కారణం తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదికతోపాటు ఇతర దర్యాప్తు వివరాల ఆధారంగా మరణానికి గల కారణాన్ని నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





