మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి: ఎంసీపీఐ(యు)

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించకుండా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాద‌గోని రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పట్టాలు జారీ చేసి, వారి నివాసాలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని పేర్కొంటూ, ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు మంగళవారం సర్వే నంబర్లు 100, 101లోని భూములను, స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీలను సందర్శించారు. అనంతరం కాలనీవాసులతో నిర్వహించిన సమావేశంలో గాద‌గోని రవి మాట్లాడుతూ.. 1996లో అప్పటి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ ఈ భూములు ప్రభుత్వానివేనని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. గతంలో పేదల నివాసాల కోసం వామపక్ష పార్టీలు అనేక పోరాటాలు చేశాయని, భూముల పరిరక్షణ కోసం నాయకులు జైళ్లకు వెళ్లి కేసులు ఎదుర్కొన్నారని తెలిపారు. మిగులు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించకుండా ప్రజల అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి. నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు జే.వి. చలపతిరావు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు హన్మేష్, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కమిటీ సభ్యుడు జానీ పాషా మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను విక్రయించకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని, కాలనీవాసుల నివాసాలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ భూముల విక్రయానికి ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) పొలిట్‌బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, మోర్తాల చందర్రావు, ఇతర వామపక్ష నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here