శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని మంజీరా రోడ్డులో ఉన్న జీ హ్యాపీడేట్ (ZEE HABITAT) అపార్ట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా భూగర్భ జలాలను అక్రమంగా తోడి విక్రయిస్తున్నారని మిద్దెల మల్లారెడ్డి ఆరోపించారు. రోజుకు సుమారు 20 ట్యాంకర్ల నీటిని తోడి విక్రయిస్తున్నారని, సెల్లార్లోకి నీరు ఊరుతోందనే సాకుతో నీటిని బయటకు తోడి అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా చుట్టుపక్కల కాలనీల్లోని బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని మిద్దెల మల్లారెడ్డి కోరారు. ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు సంబంధిత అధికారులను పంపించి, ఆరోపణలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నీటి విక్రయాలు జరుగుతున్నట్లు తేలితే వాటిని వెంటనే నిలిపివేయాలని, సెల్లార్ గుంతను మట్టితో పూడ్చివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా చుట్టుపక్కల కాలనీల్లో భూగర్భ జలాలు తగ్గకుండా, బోర్లలో నీటి లభ్యత కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






