శేరిలింగంపల్లి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.. CMC కమిషనర్‌కు గాంధీ విజ్ఞప్తి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కోరారు. ఈ మేరకు మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సృజనతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, లింక్ రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, నాలాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన చోట్ల లింక్ రోడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మసీదుబండ, తారానగర్, శ్రీదేవి థియేటర్, మియాపూర్ చౌరస్తా, అంజయ్యనగర్, ఖాజాగూడ, ట్రిపుల్ ఐటీ రోడ్ల విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రోడ్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని, టీడీఆర్ (TDR) ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. టౌన్ ప్లానింగ్, CMC ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గంగారం చెరువు నుంచి జాతీయ రహదారి NH-65 మీదుగా అపర్ణ హిల్ పార్క్ వరకు నిర్మించనున్న లింక్ రోడ్డు టెండర్ ప్రక్రియ పూర్తయినందున పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గాంధీ కోరారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. ఆల్విన్ కాలనీలోని పైప్‌లైన్ రోడ్డులో పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నాలాపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానికులకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

చందానగర్ ప్రధాన రహదారి, హైదర్‌నగర్, మియాపూర్–బొల్లారం రోడ్డు, వివేకానందనగర్–బాగ్ అమీర్ కాలనీ ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గాంధీ కోరారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాల ముప్పు కూడా ఉందని తెలిపారు. పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు అవసరమైన సౌకర్యాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలంగా మెట్లతో పాటు లిఫ్టులు లేదా ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వల్ల పాదచారుల భద్రత పెరగడంతో పాటు రహదారులపై ట్రాఫిక్ అంతరాయాలు తగ్గుతాయని వివరించారు.

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు, అసంపూర్తిగా మిగిలిన నాలాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని గాంధీ కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గాంధీ ప్రస్తావించిన అంశాలపై CMC కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ CCP వెంకన్న, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ లక్ష్మీ, ఈఈ గోపాల్, CMC ఎస్ఈ శ్రీకాంతిని, ల్యాండ్ అక్విజిషన్ అధికారి అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here