మళ్లీ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.. మహిళను వెంటాడిన కేసులో నిందితుడి అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రేమ సంబంధాన్ని కొనసాగించేందుకు నిరాకరించిన మహిళను వేధిస్తూ, వెంటాడుతూ, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో షీ టీమ్ కౌన్సెలింగ్, పోలీసుల హెచ్చరికలు ఇచ్చినా వేధింపులు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని గురువారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. నూతిగట్టు వీర వెంకట సంతోష్ దుర్గ (27), బాధితురాలు దూరపు బంధువులు. 2022లో వీరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే నిందితుడి అనుమానాస్పద, నియంత్రణ ధోరణితో విసిగిపోయిన బాధితురాలు సంబంధాన్ని కొనసాగించేందుకు నిరాకరించి, తనను సంప్రదించవద్దని స్పష్టం చేసింది. అయినప్పటికీ నిందితుడు ఆమెను వెంటాడుతూ వేధించినట్లు, సంబంధాన్ని కొనసాగించకపోతే వ్యక్తిగత ఫొటోలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.

వేధింపులు భరించలేక బాధితురాలు గచ్చిబౌలి షీ టీమ్‌ను ఆశ్రయించింది. ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించగా, బాధితురాలిని ఇకపై ఇబ్బంది పెట్టనని నిందితుడు రాతపూర్వక హామీ ఇచ్చాడు. అయినప్పటికీ వేర్వేరు మొబైల్ నంబర్లతో ఆమెను సంప్రదించడం, ఆమె మారుతున్న హాస్టల్ చిరునామాలను తెలుసుకుని వెంబడించడం, నివాసం, కార్యాలయం వద్దకు వెళ్లడం కొనసాగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాధితురాలు 2025 ఆగస్టులో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ నంబర్ 1517/2025 కింద కేసు నమోదైంది. పోలీసుల కౌన్సెలింగ్, హెచ్చరికలు, నోటీసుల తర్వాత కూడా వేధింపులు, బెదిరింపులు కొనసాగినట్లు ఆరోపణలున్నాయి.

అక్టోబర్ 27న రాత్రి సుమారు 9.30 గంటలకు బాధితురాలు కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో నిందితుడు ఫోన్ చేసి బయటకు రావాలని గట్టిగా అరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు అక్టోబర్ 28న ఉదయం 11.30 గంటలకు హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయానికి వెళ్లి ఆమెను గమనిస్తూ మొబైల్ ఫోన్‌తో ఫొటోలు తీసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి, తనకు రక్షణ కల్పించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 1696/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here