శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న భూములను ప్రభుత్వ భూమిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగతించారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ వివాదానికి న్యాయస్థానం తీర్పుతో పరిష్కారం లభించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. 2003లో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆక్రమణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ప్రభుత్వ భూమిగా తీర్పు వెలువడటం హర్షణీయమని తెలిపారు. ఈ తీర్పు ప్రజల ఆస్తులను కాపాడేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ ఈ భూముల్లో పెద్దఎత్తున ఆక్రమణలు జరిగాయని కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. తిరిగి భూ దళారులకు అవకాశం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రిజర్వ్ పోలీసు బలగాలను రంగంలోకి దించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ముందుగా ఖాళీగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమ మార్గాల్లో ఆక్రమణలకు పాల్పడిన వారిని వెంటనే తొలగించి మిగిలిన భూములను కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు.





