శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యాదవ, కురుమ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలో సగం ఓట్లు తొలగించారనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పారిజాత నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ బచావో – దేశ్ బచావో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో రఘునాథ్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో ఒకటైన రంగారెడ్డిలో ఓటర్ల జాబితాకు సంబంధించి తలెత్తిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ మోహన్ కుమార్ మంగళం, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, చేవెళ్ల భీమ్ భరత్, శేరిలింగంపల్లి జగదీశ్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సుజాత, మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి తదితర జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





