అన్నమయ్య సంకీర్తనలతో మార్మోగిన నాదబ్రహ్మోత్సవం-26

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పది రోజుల పాటు నిర్వహించిన నాదబ్రహ్మోత్సవం-26 భక్తి సంగీత వైభవంతో ఘనంగా ముగిసింది. ముగింపు రోజు ప్రముఖ గాయని గాయత్రి నారాయణన్ తన మధుర గానంతో ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. గోదావరి చిత్రంలోని రామచక్కని సీతకి పాటతో ప్రసిద్ధి పొందిన ఆమె, అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. అనంతరం గాయత్రి నారాయణన్ రామచక్కని సీతకి పాటతో పాటు అన్నమయ్య రచించిన పలు సంకీర్తనలను ఆలపించారు. ముఖ్యంగా అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న, బ్రహ్మమొక్కటే వంటి కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రజాసంబంధాల అధికారి, రచయిత జ్వాలా నరసింహారావు, పాత్రికేయుడు బండారు శ్రీనివాసరావు, ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్, రచయిత నాగసూరి వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్నమాచార్య భావనా వాహిని నిర్వహిస్తున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను వారు అభినందించారు. అన్నమయ్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. పది రోజుల పాటు సాగిన నాదబ్రహ్మోత్సవం ద్వారా అన్నమయ్య సంకీర్తనలతో భక్తిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించే ప్రయత్నం చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు మార్గదర్శకత్వంలో సాగిన ఈ ఉత్సవాలు అనేకమంది గాయనీగాయకులు, యువ కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచాయి. తద్వారా అన్నమయ్య సాహిత్యాన్ని భావితరాలకు చేరువ చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యం లభించింది.

అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ నందకుమార్‌తో పాటు సంస్థ నిర్వాహకులు ముఖ్య అతిథులను, కళాకారులను సత్కరించారు. అనంతరం శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భావ కాలుష్య నివారణ, ఆధ్యాత్మిక చైతన్య పెంపుదల లక్ష్యంగా నిర్వహించిన నాదబ్రహ్మోత్సవం-26 విజయవంతంగా ముగిసింది. అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, భక్తి సంగీతాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సంస్థ సంకల్పానికి ఈ ఉత్సవాలు మరో ముందడుగుగా నిలిచాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here