శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తన నివాసంలో సాంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, పురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విజయదశమి పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పర్వదినాన నిర్వహించే వాహన, ఆయుధ పూజలకు విశిష్టమైన స్థానం ఉందని, వృత్తిపరంగా ఉపయోగించే పనిముట్లు, పరికరాలను పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో శుభాలను నింపాలని గాంధీ ఆకాంక్షించారు.





