శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్‌లోని వేముకుంట, గౌతమినగర్‌లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో శమీ పూజ (జమ్మి పూజ) ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

శమీ పూజలో పాల్గొన్న భక్తులు పరస్పరం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆలయ ట్రస్టీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు గుఱ్ఱపు విజయలక్ష్మి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.






