శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు అమావాస్యకు రెండు రోజుల ముందుగానే ప్రారంభం కానున్నాయి. కూకట్‌పల్లి గ్రామంలోని పలుచోట్లతో పాటు కూకట్‌పల్లి హనుమాన్ దేవాలయం వద్ద ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలు ఆడిన అనంతరం వాటిని పీఎన్‌ఎం స్కూల్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం రంగథాముని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు.

బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. బతుకమ్మలు ఆడేందుకు వచ్చే ప్రతి ఆడపడుచుకు భద్రత, సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ నెల 18వ తేదీన పెద్ద బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే అవకాశం ఉండటంతో నిమజ్జనం, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.





