శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని లేక్ వ్యూ బార్ నుంచి హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌కు కలిపే ఎల్లమ్మ చెరువు వద్ద మట్టి రోడ్డును లింక్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ఎల్లమ్మ చెరువు వద్ద సరైన రహదారి సౌకర్యం లేక స్థానిక ప్రజలు, వాహనదారులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మట్టి రోడ్డులో గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. ప్రజలు, వాహనదారుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త లింక్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి సమస్యకు పరిష్కారం చూపేందుకు ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేయాలని గాంధీ సూచించారు. నవోదయ కాలనీ (లేక్ వ్యూ బార్) నుంచి హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ వరకు లింక్ రోడ్డు అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల కాలనీల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. రోడ్డు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని గాంధీ అధికారులకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, కొత్త లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో హైడ్రా అధికారులు ఎస్పీ ఆనంద్, ఏసీపీ తిరుమల్, సీఐ ముజుఫర్, ఇరిగేషన్ సీఈ దేవేందర్ రెడ్డి, డీఈ అర్చన, CMC ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ శ్రీకాంతిని, ఏఈ యుగేందర్, డబ్ల్యూఐ రవి, టౌన్ ప్లానింగ్ టీపీఎస్ మచ్చేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అక్తర్, జిల్లా గణేష్, పోతుల రాజేందర్, ఎండీ ఇబ్రహీం, కాశీనాథ్ యాదవ్, మజర్ తదితరులు పాల్గొన్నారు.





