శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): సమాజంలో మనమెంతో మనకంత వాటా దక్కేంత వరకు ఐక్యంగా పోరాడాలని గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడ్ పిలుపునిచ్చారు. చట్టసభల్లో గౌడ్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించే వరకు ఉద్యమించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న నాయకులను కాపాడుకుంటూ భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన గోపా జిల్లా కార్యవర్గ సమావేశానికి డాక్టర్ బండి సాయన్న గౌడ్, హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. విద్య, ఉద్యోగం, వృత్తి, ఆర్థిక రంగాల్లో గౌడ్ సమాజం మరింత అభివృద్ధి సాధించేలా గోపా అండగా నిలుస్తుందని తెలిపారు. అధికారులుగా, వృత్తినిపుణులుగా ఎదుగుతున్న వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సమాజాభివృద్ధికి వారి సేవలను వినియోగించుకోవడం గోపా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో మహబూబాబాద్ జిల్లా గోపా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ సుభాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేష్ గౌడ్, కోశాధికారిగా ముక్తేశ్వర గౌడ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని వివిధ గౌడ సంఘాల నాయకులు, ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన కార్యవర్గం జిల్లాలోని అధికారులు, వృత్తినిపుణుల సంక్షేమంతోపాటు గౌడ సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. గోపాను మరింత బలోపేతం చేసి, సమాజంలోని విద్యావంతులు, అధికారులు, వృత్తినిపుణులను సంఘటితం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.





