శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 105 అంగన్‌వాడీ కేంద్రాలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సొంత నిధులతో ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు ప్రెషర్ కుక్కర్లను గాంధీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

గాంధీ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. 105 కేంద్రాలకు అందించిన ప్రెషర్ కుక్కర్లు వంటలో సమయం, శ్రమను తగ్గించడంతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 0 నుంచి 6 సంవత్సరాల చిన్నారులతోపాటు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారని గాంధీ తెలిపారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, పోషకాహారం, ఆరోగ్యంపై తల్లులకు అవగాహన వంటి సేవలు అందుతున్నాయని వివరించారు.
పిల్లల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, నర్సరీ విద్య పూర్తి చేసిన చిన్నారులకు ప్రత్యేక సర్టిఫికెట్లు అందిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు చెప్పారు. పిల్లల విద్య కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే బదులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని గాంధీ సూచించారు. అంగన్‌వాడీల్లో చిన్నారులకు మెరుగైన వాతావరణంలో విద్య, పోషకాహారం అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు శోభన్, నాగమణి, శ్రీలత, ప్రతిభ, అనురాధ, లవకుమారి, నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.





