శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో మియాపూర్ పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఓ అనుమానిత డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 9 గ్రాముల బరువున్న 14 ఎక్టసీ (MDMA) ట్యాబ్లెట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తిని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పోలా సురేష్ గోపీ (29)గా గుర్తించారు. ప్రస్తుతం ఎల్‌బీ నగర్‌లో నివసిస్తున్న అతను 2024 జూలైలో గోవాకు వెళ్లి రెంటల్ ప్రాపర్టీ వ్యాపారం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో డ్రగ్స్ అక్రమ విక్రయాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయని, వారి ద్వారా మాదకద్రవ్యాలను సేకరించి పరిచయస్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎక్టసీ మాత్రలు కావాలని సురేష్ గోపీని సంప్రదించడంతో, సెప్టెంబర్ 16న ముంబై వెళ్లాడు. అక్కడ ముంబైకి చెందిన డానిష్ ఆలమ్ అన్సారీ నుంచి 29 ఎక్టసీ ట్యాబ్లెట్లను రూ.22,500కు బ్యాంకు బదిలీ ద్వారా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం 15 ట్యాబ్లెట్లను గోవాకు చెందిన మున్నా అనే వ్యక్తికి విక్రయించి, మిగిలిన 14 ట్యాబ్లెట్లతో ముంబైలోని నెరుల్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో సరఫరా చేసేందుకు తీసుకొస్తున్న సమయంలో మియాపూర్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో గోవాకు చెందిన బాబా, ముంబైకి చెందిన డానిష్ ఆలమ్ అన్సారీ పరారీలో ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలోని సమాచారం, ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ రవాణా మార్గాలు, మధ్యవర్తులు, కస్టమర్ల వివరాలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది. గోవా–ముంబై–హైదరాబాద్ డ్రగ్ నెట్‌వర్క్‌లో మరెవరెవరి ప్రమేయం ఉందో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.1342/2026 కింద NDPS Act, 1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత, కమ్యూనిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ సూచించింది. మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు లేదా ఈగల్ ఫోర్స్‌కు తెలియజేయాలని కోరింది. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, విశ్వసనీయ సమాచారదాతలకు తగిన బహుమతి అందిస్తామని తెలిపింది. EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ 87126 71111 ద్వారా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొంది.





