శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులయ్యామని చెబుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీలోకి భారీగా చేరారు. మదీనాగూడ డివిజన్ రామకృష్ణనగర్ కాలనీకి చెందిన 800 మందికి పైగా యువకులు, మహిళలు బీజేపీలో చేరారు. హఫీజ్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష–మహేష్ యాదవ్, ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి వారు కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మోదీ పారదర్శక పాలన, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకమే పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరడానికి కారణమన్నారు. మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. రామకృష్ణనగర్ కాలనీ నుంచి 800 మందికి పైగా యువకులు, మహిళలు ఒకేసారి బీజేపీలో చేరడం శేరిలింగంపల్లిలో పార్టీకి పెరుగుతున్న బలం, ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందన్నారు. మదీనాగూడ రామకృష్ణనగర్ కాలనీ నుంచి 800 మంది యువకులు, మహిళలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరడం శేరిలింగంపల్లిలో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు. పార్టీలో చేరుతున్న వారిని భయపెట్టి, బెదిరించడం సరికాదని రవికుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్లుగా మూడు పార్టీలు మారిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే.. ఆస్తుల అభివృద్ధి తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాబోయే సీఎంసీ ఎన్నికల్లో 24 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రవికుమార్ యాదవ్ నాయకత్వంలో ఇంత భారీ చేరిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావడానికి ఈ చేరికలు దోహదపడతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీలో చేరిన శ్యామల ప్రసాద్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు రాఘవేంద్రరావు, నాగుల్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, సురేష్ కుర్మా, రమేష్ యాదవ్, మాణిక్ రావు, వినయ, పద్మ, రాజు, జితేందర్, సత్యనారాయణ రాజు, సీతారామరాజు, రాజేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్, శివ, రవి తదితరులు పాల్గొన్నారు.





