శేరిలింగంపల్లిలో రూ.79.58 కోట్లతో నాలాల విస్తరణ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా నాలాల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. SNDP ఫేజ్-2లో భాగంగా నియోజకవర్గంలో రూ.79.58 కోట్ల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనీలో పటేల్ చెరువు అలుగు నుంచి గంగారం చెరువు వరకు చేపడుతున్న నాలా విస్తరణ పనులను గాంధీ పరిశీలించారు. రూ.18.92 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్‌లో భాగంగా RCC బెడ్, సైడ్‌వాల్స్, నాలా విస్తరణ పనుల పురోగతిని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపడుతున్నామని తెలిపారు. గతంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. నాలాల విస్తరణ, RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని అన్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలా విస్తరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను గాంధీ ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాలా నిర్మాణ సమయంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సరైన లెవల్స్‌ను నిర్ధారించుకుని పనులు చేపట్టాలని తెలిపారు. ప్రధాన రహదారులపై పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని గాంధీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో వరద ముంపు సమస్య పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలతో నాలా విస్తరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. నాలాల విస్తరణ పనుల విషయంలో ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here