శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ డెంటల్ క్లినిక్‌లోకి అనధికారికంగా ప్రవేశించి పరికరాలు, పార్టిషన్లు, రికార్డులు ధ్వంసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డా. జి. మన్మోహన్ నిర్వహిస్తున్న Manu Multispeciality Dental Care క్లినిక్‌కు సంబంధించి 2022లో రెంటల్ అగ్రిమెంట్ పూర్తైన అనంతరం భవన యజమానితో అద్దె వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12న రాత్రి భవన యజమాని రామచంద్రారెడ్డి, ఉమారాణి తదితరుల ప్రేరేపణతో నరేన్‌రెడ్డి, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు క్లినిక్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారని డా. మన్మోహన్ ఆరోపించారు. క్లినిక్‌లోని డెంటల్ పరికరాలు, పార్టిషన్లు, రికార్డులు తదితరాలను ధ్వంసం చేసి, కొన్ని వస్తువులను బలవంతంగా బయటకు తరలించారని తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





