మట్టి వినాయకుడినే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: శ్రవణ్ కుమార్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితిని పర్యావరణహితంగా, సుస్థిరంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జై గణేష భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. వినాయక చవితి విశిష్టతను కాపాడుతూ ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా పండుగను జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని ఆయన సూచించారు. చెరువులు, కుంటలు, ఇతర జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని లేదా పూర్తిగా నివారించాలని కోరారు.

విగ్రహాల తయారీలో మట్టితోపాటు ప్రకృతిలో లభించే పత్తి, నార‌ వంటి సహజసిద్ధమైన పదార్థాలను వినియోగించాలని శ్రవణ్ కుమార్ సూచించారు. అలాగే సహజ రంగులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) విగ్రహాల వినియోగం నిషేధించబడిందని గుర్తు చేసిన ఆయన.. పీఓపీ విగ్రహాల్లోని హానికరమైన రసాయనాలు నీటి వనరులను కలుషితం చేసే ప్రమాదం ఉందన్నారు. జల కాలుష్యాన్ని నివారించేందుకు పర్యావరణ అనుకూలమైన క్లే గణేష్ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే సందేశంతో ఈ ఏడాది వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని శ్రవణ్ కుమార్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here