శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్లో గణేష్ ఉత్సవ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గణేష్ ఉత్సవ కమిటీలకు చెందిన సుమారు 150 మంది నిర్వాహకులు హాజరయ్యారు. సమావేశానికి ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలు, గణేష్ విగ్రహాల ఊరేగింపు ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం పోలీసు అధికారులు ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియంత్రణ, ఊరేగింపుల నిర్వహణ తదితర అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు. పోలీసులకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పిలుపుతో కొందరు నిర్వాహకులు గణేష్ ఉత్సవాల సందర్భంగా వాలంటీర్లుగా సేవలందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చందానగర్ ఎస్హెచ్వో ఎ.శ్రీధర్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డి, డీఐ ప్రదీప్, ఎస్ఐ రాధిక, ట్రాఫిక్ ఎస్ఐ కోటేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐలు అశోక్, శ్రీనయ్య, యాదమ్మ, హెచ్సీలు పద్మనాభం, దాస్, జైపాల్తో పాటు చందానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






