శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా గణేష్ ఉత్సవాల్లో మట్టి, విత్తనాలతో రూపొందించిన విగ్రహాలను ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు చిర్ర రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డా. జి. సృజనను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి విత్తన గణేష్ విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు గణేష్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

విగ్రహాల నిమజ్జనం అనంతరం అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదిగేలా రూపొందించే విత్తన గణేష్ పర్యావరణహిత సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలు మిద్దెల మల్లారెడ్డి, గంగారం, సంగారెడ్డి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





