మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల వినియోగాన్ని తగ్గించి, మట్టి గణపతులను పూజించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్.కే.వై ఫౌండేషన్ గత ఐదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి మసీద్‌బండలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక చవితిని ప్రజలంతా పవిత్రంగా, ఘనంగా జరుపుకుంటారని అన్నారు. అయితే పీఓపీతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఐదేళ్లుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న రవికుమార్ యాదవ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ప్రతి ఇంట్లో, గల్లీలో, బస్తీలో, కాలనీలో, అపార్ట్‌మెంట్‌లో, గేటెడ్ కమ్యూనిటీలో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. పీఓపీ విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని చెప్పారు. మట్టి గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత మట్టి నీటిలో కరిగిపోయి ప్రకృతిలో కలిసిపోతుందని, తద్వారా పర్యావరణానికి హాని తగ్గుతుందని వివరించారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, మాణిక్ రావు, రమేష్ నాయి, మహేష్, అనూష యాదవ్, రాజేష్ గౌడ్, లక్ష్మణ్, గణేష్ ముదిరాజ్, రవి నాయక్, ఆంజనేయులు, సాగర్, రాజు యాదవ్, జితేందర్, బాలు యాదవ్, పద్మ, మేరీ, కవిత, లక్ష్మి, భూపాల్ రెడ్డి, రాజిరెడ్డి, పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here