శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులడు, ఆచార్య పిల్లలమర్రి రాములు హాజరయ్యారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, గురుకుల కళాశాలలు, జవహర్ నవోదయ విద్యాలయం, యూనివర్సిటీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 35 మంది అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలాలతో వేదమంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా సత్కరించారు. ఈ కార్యక్రమం బిల్డర్, సోషల్ వర్కర్ తూనిక రాఘవేంద్రరావు, యు.వి. రమణమూర్తి సౌజన్యంతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి అధ్యాపక వృత్తి అని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువుకే స్థానం ఉందన్నారు. గురువు శిష్యుల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి విద్యే ప్రధాన కారణమని ఆయన అన్నారు. పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, మానవతా, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థుల్లో పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడిగా దేశానికి విశేష సేవలు అందించారని రాములు పేర్కొన్నారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను పురస్కరించుకుని భారత ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు.

నేటి యువ అధ్యాపకులు రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. భారతీయ సనాతన విధానంలోని గురుశిష్య బంధం నైతికతను పరిరక్షిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రరెడ్డి, మండల విద్యాధికారి వెంకటయ్య, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు బసవలింగం, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, జి.వి. రావు, బాలన్న, సుజాత, వీణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





