శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పౌర సేవలు, రాబోయే వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంజనీరింగ్, అర్బన్ బయోడైవర్సిటీ (UBD), శానిటేషన్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ అమిత్ మాట్లాడుతూ.. జోన్ పరిధిలో కొనసాగుతున్న అన్ని ఇంజనీరింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

నగర సుందరీకరణలో భాగంగా UBD విభాగం చేపడుతున్న ప్లాంటేషన్, పార్కుల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని జోన్ వ్యాప్తంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే చెరువుల వద్ద లైటింగ్, రోడ్ల మరమ్మత్తులు, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పౌర సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులకు నారాయణ అమిత్ సూచించారు.





