శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా, బీజేపీ కార్యకర్తలకు మద్దతుగా నల్గొండకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్‌లను పోలీసులు అడ్డుకుని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్ట్ చేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదన్నారు. బీజేపీ నాయకులను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అరెస్టులు, అణచివేత చర్యలతో బీజేపీ నాయకుల పోరాటాన్ని ఆపలేరని రాధాకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.






