శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఈఆర్‌ఓ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, నోటీసుల జారీ, ఫారం-6 సమర్పణ తదితర అంశాలపై అధికారుల దృష్టికి పలు సూచనలు తీసుకువచ్చారు.

ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్లకు అందజేస్తున్న నోటీసులపై బీఎల్‌ఓలు, సంబంధిత సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మాధవరం రంగారావు కోరారు. నోటీసులు అందుకున్న ఓటర్లను కార్యాలయాలకు పిలిపించి ఇబ్బందులకు గురిచేయకుండా, బీఎల్‌ఓలు వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు అవసరమైన వివరాలను సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించి, వారిలో ఎలాంటి భయాందోళనలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
అదేవిధంగా ఫారం-6కు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత ఇవ్వాలని, ఫారం-6 సమర్పించే సమయంలో అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్లు ఏమిటో ప్రజలకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తున్నారో వారి జాబితాతో పాటు ASDD జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని అధికారులను కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని, ఓటర్లలో భయాందోళనలు కలిగించడం కాకుండా, ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించడం అధికారుల ప్రధాన బాధ్యత అని మాధవరం రంగారావు అన్నారు.





