మైనారిటీ మహిళలకు రూ.50 వేల ఆర్థిక చేయూత

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన మైనారిటీ మహిళలకు రూ.50 వేల చొప్పున 100 శాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పథకం కింద ఎంపికైన 232 మంది లబ్ధిదారుల్లో 225 మందికి మొత్తం రూ.1.12 కోట్ల విలువైన చెక్కులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, కలెక్టర్‌ మను చౌదరి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్, కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండి రమేష్‌లతో కలిసి ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వశక్తితో ఎదిగేలా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజనను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా అందుతున్న రూ.50 వేల ఆర్థిక సహాయంతో మహిళలు చిన్నతరహా వ్యాపారాలు, వివిధ స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చని గాంధీ పేర్కొన్నారు. తద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతో పాటు మహిళలు స్వతంత్రంగా ఆదాయం పొందే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచి, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 83 మంది ఎంపికైన వారిలో 57 మంది తుర్క కాశ మైనారిటీలకు స్టోన్‌ కటింగ్‌ జనరేటర్లు, టూల్‌ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు గాంధీ తెలిపారు. అలాగే 414 మంది లబ్ధిదారుల లక్ష్యంలో 112 మందికి ఈ-స్కూటీలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

జిల్లాలో 900 మంది మైనారిటీ చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. సీఎం ఓవర్సీస్‌ పథకం కింద జిల్లాలో 37 మంది మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.8.23 కోట్ల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోందన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఆపై స్థాయి మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం రూ.27.14 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 563 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ తెలిపారు. రూ.50 వేల ఆర్థిక సహాయం అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here