జనచైతన్య కాలనీలో వన మహోత్సవం.. మొక్కలు నాటి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలి: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జనచైతన్య కాలనీలో CMC UBD విభాగం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. CMC అదనపు కమిషనర్ UBD సుభద్ర దేవి, డీసీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. జనచైతన్య కాలనీ వాసులు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాలనీని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మానవాళి మనుగడకు మొక్కలు శ్రీరామరక్ష అని, సమస్త జీవకోటికి అవి ప్రాణాధారమని పేర్కొన్నారు.

అడవుల శాతం పెంచాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు పచ్చదనం పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. UBD విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవాన్ని గాంధీ అభినందించారు. కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షిస్తూ కాలనీలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు కాలనీ వాసులు సహకరించాలని కోరారు. మారేడు, వెలగ, జమ్మి వంటి స్థానిక జాతులతో పాటు రుద్రాక్ష, గంధపు చెట్టు, ఎర్రచందనం వంటి మొక్కలకు పర్యావరణ, ఔషధ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని గాంధీ తెలిపారు. ఇలాంటి మొక్కలను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణాల్లో పచ్చదనం మెరుగుపడుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పట్టణ వాతావరణం కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, అనువైన ఇతర ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని చిన్నపిల్లలను పెంచినట్లు సంరక్షించాలని అన్నారు. పిల్లలు, మహిళలు, యువత, వృద్ధులు ఇలా అన్ని వర్గాలను వన మహోత్సవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో UBD మేనేజర్లు సతీష్ బాబు, విక్రమ్ చంద్ర, నాయలు ప్రతాప్ రెడ్డి, జనచైతన్య కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, ఇగ్నైట్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here