అక్ర‌మ నిర్మాణాల‌పై చర్య‌లు తీసుకోవాలి: షేక్ హమీద్ పటేల్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రమాదానికి కారణమైన భవన నిర్మాణ యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హమీద్ పటేల్ కోరారు. నిర్మాణ అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తూ అదనపు అంతస్థులు నిర్మిస్తున్న భవన యాజమాన్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణంలో ఉన్న భవనాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని హమీద్ పటేల్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here