శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో నాలాను ఆనుకుని తక్కువ విస్తీర్ణంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పక్కనే ఉన్న మరికొన్ని నిర్మాణాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. CMC కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, DCP రితి రాజ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, CCP వెంకన్నతో పాటు NDRF, హైడ్రా, టౌన్ ప్లానింగ్, ఇతర శాఖల అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ భవనం ఆకస్మికంగా కూలిపోవడం అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన ఘటన అని అన్నారు. నిర్లక్ష్యంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్మాణ అనుమతులపై స్పష్టత కలిగి ఉండాలని, అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని గాంధీ ఆదేశించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి, బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులకు సూచించారు.

యజమానులు, బిల్డర్ల అత్యాశతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గాంధీ పేర్కొన్నారు. ఘటనలో ఇద్దరు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.





