శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలో బోర్‌వెల్ పనికి వెళ్లిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 57 ఏళ్ల కార్మికుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జీత్ రూ రామ్ కశ్యప్ (57), తండ్రి దశరథ, సుమారు 20 రోజుల క్రితం తన గ్రామానికి చెందిన వారితో కలిసి బోర్‌వెల్ బండిపై పనికి వచ్చాడు. మక్తా మహబూబ్‌పేటకు చెందిన రవీందర్‌రెడ్డి వద్ద పనిచేస్తూ, అతని వద్దే నివాసం ఉంటున్నాడు.

ఈ నెల 17న అవంతి ఎన్‌క్లేవ్, మదీనాగూడలో బోర్‌వెల్ పనికి వెళ్లిన జీత్ రూ రామ్ కశ్యప్ ఉదయం 10 గంటల సమయంలో తన తోటి కార్మికుడికి బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. అయితే ఆ తర్వాత తిరిగి రాలేదు. అతని కోసం తోటి కార్మికులు, బోర్‌వెల్ యజమాని పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బోర్‌వెల్ యజమాని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అదృశ్యమైన జీత్ రూ రామ్ కశ్యప్ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.





