శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 44 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ సృజన పౌరులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

ప్రజావాణిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి 31 ఫిర్యాదులు అందగా.. ఇంజినీరింగ్‌కు 6, అర్బన్ బయోడైవర్సిటీకి 2 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్టేట్స్, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్), శానిటేషన్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ శాఖలకు ఒక్కో ఫిర్యాదు నమోదైంది. పౌరులు సమర్పించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారులు తమ సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తూ, పురోగతిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.





