18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానేత రాజీవ్ గాంధీ: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాజీ ప్రధాని, భారతదేశ 7వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని గంగారంలో 18 ఏళ్లు నిండిన యువతతో కలిసి ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. యువతకు రాజకీయాల్లో మార్గదర్శకుడిగా రాజీవ్ గాంధీ నిలిచారని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించిన మహానేత రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. దేశానికి అత్యంత పిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.

హైదరాబాద్‌ ఐటీ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించడానికి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు కీలకంగా నిలిచాయని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం కేవలం 40 ఏళ్ల వయసులో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ.. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించడంతో పాటు దేశ ఆధునీకరణకు పునాది వేశారని తెలిపారు. ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, టెలికాం, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం, శాంతి ఒప్పందాలను బలోపేతం చేయడం వంటి అనేక కీలక నిర్ణయాలు రాజీవ్ గాంధీ పాలనలో జరిగాయని పేర్కొన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ అందించిన సేవల ఫలితంగానే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమై, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి చేరుకుందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి జైపాల్, శ్రామిక శక్తి అవార్డు గ్రహీత, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరమల్ల వీరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. INTUC, టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా బ్లాక్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here