శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో గువ్వల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో భాగంగా ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ.. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు రూ.30.71 లక్షలు మంజూరయ్యాయని గాంధీ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాల ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్న గాంధీ.. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





