శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. మసీద్ బండలోని తన కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ, జాతీయ జెండాపై గౌరవాన్ని చాటేలా ప్రతి కుటుంబం తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు.

త్రివర్ణ పతాకం దేశ స్వాతంత్ర్యం, ఐక్యత, సార్వభౌమత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు. అలాగే జాతీయ జెండా గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రవికుమార్ యాదవ్ కోరారు.





