శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా ఆధ్వర్యంలో గిరిజన బంజారా ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్ పాల్గొని మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా, అనేక గిరిజన తండాలు ఇప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోలేదని స్వామి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్లో ఉన్న నడిగడ్డ తండా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదని తెలిపారు.

రాష్ట్రంలో బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల హక్కులు, అభివృద్ధి కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ సైనికులుగా ఏర్పడి బంజారా జాతిని చైతన్యపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్వామి నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్, సీతారాం నాయక్, శంకర్ నాయక్, గోపి నాయక్, మురళి, మహేష్, రాఘవేంద్ర, హరి నాయక్, లక్ష్మణ్ నాయక్, పీర్య నాయక్, ఈశ్వర్, మోహన్ నాయక్, జితేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





