శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్, వేముకుంట, గౌతమినగర్ కాలనీలలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న గాంధీ మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు మొత్తం రూ.30.71 లక్షల నిధులు మంజూరయ్యాయని గాంధీ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





