శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): బోనాల పండుగ బందోబస్తు నేపథ్యంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న బీరప్ప ఆలయాన్ని డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీడీ ఉదయ్‌రెడ్డి సందర్శించారు. ఆలయ నిర్వాహకులతో మాట్లాడి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఆలయానికి సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలతో నిరంతరం సన్నిహితంగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి సెక్టార్ ఎస్‌ఐ ఆలయ నిర్వాహకులు, యువత, కమ్యూనిటీ ప్రతినిధులు, స్థానిక పెద్దలతో బలమైన సమన్వయం కలిగి ఉండాలని డీసీపీ సూచించారు.

సెక్టార్ పరిధిలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పెట్రోలింగ్ వాహనాల ద్వారా మాత్రమే కాకుండా, స్థానిక ప్రజలు, ఆలయ నిర్వాహకుల నుంచి సంబంధిత సెక్టార్ ఎస్‌ఐకి ముందుగానే సమాచారం చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ మేరకు అన్ని సెక్టార్ ఎస్‌ఐలు తమ మొబైల్ నంబర్లను ఆలయ నిర్వాహకులు, యువత, కమ్యూనిటీ ప్రతినిధులకు అందుబాటులో ఉంచాలని, వారితో క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించాలని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆదేశించారు. ప్రజలకు తక్షణమే అందుబాటులో ఉంటూ సమస్యలపై వెంటనే సమాచారం సేకరించి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.





