శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. జగద్గిరిగుట్ట మగ్దుం నగర్లోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఆధ్వర్యంలో, నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బిర్రు ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసించే జగద్గిరిగుట్ట వంటి ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఆరోగ్య శిబిరాలు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య బృందాలు విద్యార్థులు, స్థానికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమంలో పద్మావతి నీలంశెట్టి, లయన్ జీత్, సుబ్రహ్మణ్యం, రమేష్ బాబు, నర్సింహులు, బాషా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





