శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాల నేపథ్యంలో నీటిమునిగే ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసేందుకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి సోమవారం పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్కం చెరువు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ పరిసరాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) క్యాంపస్ ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల సమయంలో నీరు నిలిచిపోయే ప్రాంతాల్లో పారుదల పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ పనితీరును అధికారులు సమీక్షించారు. నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జోనల్ కమిషనర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.






