దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.. రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట డీహెచ్‌పీఎస్ ధర్నా

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కే. వెంకటస్వామి అధ్యక్షత వహించగా, జిల్లా ఇన్‌చార్జి టి. రామకృష్ణ పాల్గొని దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల సంక్షేమ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న అసైన్డ్ భూములపై ఉన్న పరిమితులను తొలగించి సంపూర్ణ యాజమాన్య హక్కులు (పట్టాలు) కల్పించాలని, తద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళిత కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కోసం పూర్తిస్థాయిలో వినియోగించాలని కోరారు. నిరుపేద దళితులకు ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు అందజేయాలని, డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీపీఐ పార్టీ కార్యదర్శి కే. చందు యాదవ్, డీహెచ్‌పీఎస్ మండల కార్యదర్శి జెట్టి శ్రీనివాస్, ఎస్. కొండలయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు కూన సుధాకర్, ఎస్. నారాయణ, కూన కాసిం, బి. రామస్వామి, ఎస్. నరసమ్మ, రఘు, భాస్కర్, చెన్నయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here