శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో ఆగస్టు 7న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు, మండల్ దివస్ జాతీయ కన్వెన్షన్ పోస్టర్‌ను శనివారం హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద ఆవిష్కరించారు. AIOBCSA జాతీయ కోఆర్డినేటర్ శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి. కిరణ్ కుమార్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. పూలే ఆశయాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మండల్ కమిషన్ ద్వారా లభించిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ హక్కులను పరిరక్షించడం ప్రతి బహుజన వర్గం బాధ్యత అని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సహా అణగారిన వర్గాల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. ఈ జాతీయ కన్వెన్షన్ సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కీలక వేదికగా నిలుస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది ఓబీసీ విద్యార్థులు, పరిశోధకులు, యువజన నాయకులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు ఈ కన్వెన్షన్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా AIOBCSA రూపొందించిన ఓబీసీల 10 కీలక డిమాండ్లపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

కులగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, 50 శాతం పరిమితి తొలగింపు, ఉన్నత విద్యలో పూర్తి స్థాయి రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లతో పదోన్నతులు, ప్రతి విశ్వవిద్యాలయంలో ఓబీసీ సెల్ ఏర్పాటు, ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌ల పెంపు, ఓబీసీ విద్యార్థుల సంక్షేమ చర్యలు, నిర్ణయాత్మక సంస్థల్లో ప్రాతినిధ్యం, సామాజిక న్యాయ విధానాల బలోపేతం వంటి అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సాయన్న ముదిరాజ్, కొండల్, డాక్టర్ శ్రావణ్, గణేష్, జగదీష్, మేఘన, పావని, శివ, పవన్, వీరేష్, శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7న హెచ్‌సీయూలో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి–మండల్ దివస్ జాతీయ కన్వెన్షన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, యువత, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సామాజిక న్యాయాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని AIOBCSA పిలుపునిచ్చింది.





