ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి తల్లిని హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎల్‌బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా 12వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నం. 1582/2022, సెషన్స్ కేసు నం. 54/2024కు సంబంధించి విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం నిందితుడు ఎద్దు సందీప్ కుమార్ అలియాస్ బబ్లు (26) కు శిక్ష ఖరారు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు వైభవికి 2018లో నిందితుడితో పరిచయం ఏర్పడి ప్రేమ సంబంధం కొనసాగింది. అనంతరం వైభవి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను తరచూ వేధిస్తూ, బెదిరిస్తూ వచ్చాడు. ఆమె ఫోన్ నంబర్ బ్లాక్ చేసినప్పటికీ వివిధ నంబర్ల నుంచి సంప్రదిస్తూ ఇబ్బందులకు గురిచేశాడు.

2022 మే నెలలో వైభవి తన తల్లి శోభ, సోదరుడితో కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌కు వచ్చి నివాసం ఏర్పరుచుకుంది. 2022 డిసెంబర్ 13 ఉదయం సుమారు 10:30 గంటలకు నిందితుడు వారి ఇంటికి వెళ్లి వైభవి తల్లి శోభతో గొడవకు దిగాడు. అనంతరం కత్తితో వైభవి, ఆమె తల్లి శోభపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్ర గాయాలకు గురిచేశాడు. అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ శోభ మృతి చెందగా, మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని 2022 డిసెంబర్ 23న రిమాండ్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా న్యాయస్థానం నిందితుడికి ప‌లు శిక్షలు విధించింది. ఐపీసీ సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా, ఐపీసీ సెక్షన్ 307 కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా, ఐపీసీ సెక్షన్ 452 కింద 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు.

ఈ కేసును అప్పటి మియాపూర్ ఇన్‌స్పెక్టర్, ప్రస్తుతం మహబూబాబాద్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఎన్. తిరుపతి రావు దర్యాప్తు చేశారు. దర్యాప్తు అధికారి, ప్రాసిక్యూషన్ బృందం, కోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులు, పోలీసు సిబ్బంది, సాక్షుల సమన్వయంతో కేసులో శిక్ష ఖరారైంది. విచారణను మియాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here