శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ప్రమాదవశాత్తు నాలాలో గల్లంతైన బాలయ్య (70) కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ గాలింపు చర్యలను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, డీసీ సేవా ఇస్లావత్, టౌన్ ప్లానింగ్ ప్లానర్ శ్యామ్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించిన గాంధీ, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని పోలీసు, హైడ్రా, NDRF, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం, జలమండలి అధికారులకు పలు సూచనలు చేశారు.

బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన PAC చైర్మన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. గల్లంతైన బాలయ్య కోసం అర్థరాత్రి రెండు గంటల వరకు నాలా అవుట్లెట్లు, చెరువు ఇన్లెట్, అవుట్లెట్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. ప్రతి మ్యాన్‌హోల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, ఆచూకీ లభించే వరకు శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని గాంధీ సూచించారు. వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఆయన ఆదేశించారు.





